గోదావరిఖని, 24 October
సింగరేణి నిధులతో పాత జిమ్ ను పునరుద్ధరించాలని, క్రీడా మైదానంలో ఓపెన్ జిమ్, లైటింగ్, తాగునీటి వసతి కల్పించాలని కోరారు
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ ఇంక్లైన్ కాలనీ టౌన్ ప్రాంతంలో సుమారు 7 డివిజన్లలో 23 వేల ఓటర్లు, 50 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు మరియు వారి కుటుంబాలు. నేటి యువత డ్రగ్స్, గుట్కా, మద్యం వంటి చెడు వ్యసనాల బారిన పడుతున్న నేపథ్యంలో, వారిని మంచి మార్గంలో నడిపించి, శారీరక, మానసిక ఉల్లాసం కల్పించడం అవసరమని జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, అడ్వకేట్ ఇరికి మహేష్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన లేఖ రాశారు. అందులో రెండు ప్రధాన వినతులు చేశారు. మొదటిది, క్లబ్ లోని పాత జిమ్ పరికరాలు పాడైపోయాయని, వాటిని సింగరేణి నిధులతో అత్యాధునిక పవర్ జిమ్ గా పునరుద్ధరించాలని, తద్వారా కార్మికులు, యువత తక్కువ రుసుముతో వ్యాయామం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. రెండవది, డా. ఏపీజే అబ్దుల్ కలాం క్రీడా మైదానంలో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు వాకింగ్ కు వస్తున్నారని, అక్కడ ఓపెన్ జిమ్ తో పాటు లైటింగ్, తాగునీటి వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి -2 జనరల్ మేనేజర్ కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.











