బాధితులు తమ సమస్యల కారణంగా తీవ్ర మానసిక వేదన, ఆందోళనలో ఉంటారని, వారిని మరింత ఇబ్బందులకు గురిచేయకుండా అత్యంత సున్నితత్వంతో, గౌరవప్రదంగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. శనివారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసుల్లో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి, బలమైన సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించాలని, న్యాయస్థానంలో కేసులను సమర్థవంతంగా వాదించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు సమన్లను సకాలంలో అందజేసి, వాటి వివరాలను సిసిటిఎన్ఎస్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ వారెంట్లను త్వరితగతిన అమలు చేయాలని సూచించారు. మూడు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న వారెంట్ల అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, ప్రొక్లమేషన్ ఆదేశాలను సిసి టిఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులు, బాధితులు, సాక్షులు నిర్ణీత తేదీల్లో కోర్టుకు హాజరయ్యేలా దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు, పక్కా ఆధారాల సేకరణ, సాక్షుల హాజరు, సకాలంలో చార్జిషీట్ల దాఖలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం ద్వారా కన్విక్షన్ శాతం పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. బాధితులతో అత్యంత సున్నితత్వంతో, గౌరవప్రదంగా వ్యవహరించాలని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించడం ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యత అని అన్నారు.
న్యాయ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దర్యాప్తులో ఏవైనా సమస్యలు లేదా జాప్యానికి కారణమయ్యే అంశాలు ఎదురైతే సంబంధిత ఎస్ఐ, ఇన్స్పెక్టర్ల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే ఉన్నతాధికారుల స్థాయిలో తగిన సూచనలు, సహకారం అందిస్తామని తెలిపారు. సాక్షుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎలక్ట్రానిక్ ఆధారాలతో పాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు కూడా కేసుల నిరూపణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కేసుల దర్యాప్తును నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు, విచారణ త్వరితగతిన జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దర్యాప్తు అధికారుల వైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం లేదా లోపాలకు తావులేకుండా ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. కోర్టు విచారణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా సంబంధిత మేజిస్ట్రేట్లతో సమన్వయం చేసుకుంటూ కేసుల పరిస్థితిని వివరించాలని సూచించారు. ప్రతి కేసులో న్యాయం జరిగేలా బాధితులకు భరోసా కల్పించడం, సాక్షులను రక్షించడం, దర్యాప్తు నుంచి న్యాయస్థానంలో విచారణ వరకు ప్రతి ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పోలీస్ కమిషనర్ తెలిపారు.
కోర్టు విచారణలకు సంబంధిత అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సమర్థవంతంగా పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపు, ప్రోత్సాహకాలు తప్పకుండా ఉంటాయని పేర్కొన్నారు. తమ పనితీరు ద్వారా బాధితులకు న్యాయం చేస్తూ, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంపొందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కీలక పాత్ర పోషించిన కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులను పోలీస్ కమిషనర్ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, వర్టికల్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, తాండూర్ సీఐ దేవయ్య, సీసీఆర్బీ ఎస్ఐలు ఉపేందర్, వినీత, సీసీ సందీప్, కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు.












