రామగుండం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
పోలీస్ స్టేషన్లను పరిశుభ్రంగా, క్రమబద్ధంగా నిర్వహించడంతో పాటు నేర నియంత్రణపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఐపీఎస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగుండం పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఐ హరి శేఖర్‌తో మాట్లాడి ఆన్లైన్లో కేసుల నమోదు, ఈ-సాక్ష్య, ఈ-సమన్ల అమలు, అండర్ ఇన్వెస్టిగేషన్ () కేసులు, పెండింగ్‌లో ఉన్న పాత కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు వారిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన అన్ని రికార్డులు, రిజిస్టర్లను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, కేసులకు సంబంధించిన వాహనాలను క్రమబద్ధంగా భద్రపరచాలని తెలిపారు. రౌడీషీట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సంబంధిత వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు.
ఎస్హెచ్ఓలు బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఎన్డీపీఎస్, ప్రాపర్టీ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రైల్వే పోలీస్ పరిధిలోని జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులతో సమన్వయం కొనసాగించాలని తెలిపారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లోని అన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు అందే ఫిర్యాదులపై చట్టప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన కేసుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేషన్ రైటర్లతో సహా ప్రతి పోలీస్ సిబ్బంది తమ విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పీఎం రాహత్ పథకంపై ముందుగా పోలీస్ సిబ్బందికి, అనంతరం ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి, సిబ్బంది పూర్తి బాధ్యతతో పనిచేయాలని సీపీ సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో అలసత్వాన్ని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం సీఐ కృష్ణ కుమార్ పాల్గొన్నారు.












