Vijayawada, 2026-09-02
దగ్గుబాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెరిగా ప్రకాష్ అనే వ్యక్తికి ముఖానికి అత్యవసర శస్త్రచికిత్స అవసరమైంది. చికిత్స ఖర్చుల గురించి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఆశ్రయించగా, ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.1,26,946 ఆర్థిక సాయాన్ని ఎల్ఓసీ ద్వారా ఒక్కరోజులోనే మంజూరు చేయించారు.
ఆపదలో ఉన్న ప్రాణానికి సీఎంఆర్ఎఫ్ భరోసా
ముఖానికి అత్యవసర శస్త్రచికిత్స
ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబానికి అండ
ఒక్కరోజులోనే రూ.1.26 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం
క్రౌన్ హ్యూమన్ రైట్స్ యద్దనపూడి 2 సెప్టెంబర్ 2026 : రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి ముఖానికి అత్యవసర శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. చికిత్స ఖర్చులు ఎలా భరించాలో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న వేళ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆ కుటుంబానికి భరోసాగా నిలిచారు. బాధితుల విజ్ఞప్తిపై వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1,26,946 సాయాన్ని ఎల్ఓసీ ద్వారా ఒక్కరోజులోనే మంజూరు చేయించారు. యద్దనపూడి మండలం తనుబోద్ధివారిపాలెం గ్రామానికి చెందిన 42 ఏళ్ల మెరిగా ప్రకాష్ దగ్గుబాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గుంటూరులోని కిమ్స్ శిఖర ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రమాదం తీవ్రంగా ఉందని, ముఖానికి శస్త్రచికిత్స అవసరమని సూచించారు. అత్యవసర చికిత్స నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఆశ్రయించారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.1,26,946 ఆర్థిక సాయం ఎల్ఓసీ ద్వారా ఒక్కరోజులోనే అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంతో కుదేలైన కుటుంబానికి అత్యవసర సమయంలో ఆర్థిక సాయం అందడంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఊరట చెందారు. చికిత్స కొనసాగుతున్న సమయంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే ఏలూరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.












