కార్మిక సంఘం
రామగుండం-2 ఏరియా (ఓసీపీ-3) పరిధిలోని సింగరేణి సంస్థ పరిరక్షణకు, కార్మికుల న్యాయమైన హక్కుల సాధనకు నిరంతరం పోరాడుతున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) విధానాలకు ఆకర్షితులై పలువురు యువ కార్మికులు శుక్రవారం సీఐటీయూ లో భారీగా చేరారు. సీఐటీయూ ఆర్జీ-2 ఏరియా బ్రాంచ్ కార్యదర్శి కుంట ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు మంద నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి నూతనంగా యూనియన్ లో చేరిన యువ కార్మికులకు సీఐటీయూ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి మాట్లాడుతూ, సీఐటీయూ ఏ ఒక్క వర్గానికో, రాజకీయ స్వార్థ ప్రయోజనాలకో తలవంచకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ, కార్మికుల సంక్షేమం, హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా సీఐటీయూ చేపడుతున్న నిరంతర పోరాటాలను ప్రత్యక్షంగా గమనించి, యూనియన్ పై విశ్వాసంతో యువ కార్మికులు పెద్ద సంఖ్యలో చేరడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు.
సింగరేణి కార్మికులందరికీ సొంతింటి పథకం సమర్థవంతంగా అమలయ్యే వరకు పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోరాడుతామని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో సీఐటీయూ ను మరింత బలోపేతం చేస్తూ, కార్మికుల ఐక్యతను పెంపొందించడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓసిపి-3 పిట్ సెక్రటరీ రాంప్రసాద్, అసిస్టెంట్ సెక్రటరీ వినేష్, నాయకులు విజయకుమార్, శ్రీనివాస్, సుమన్, రాజశేఖర్, మల్లేశం, శ్యాంప్రసాద్ తో పాటు నూతనంగా చేరిన యువ కార్మికులు శ్రీకాంత్, కార్తీక్, ఎండీ యాకూబ్, వంశీ, ఎస్.కే. యాకూబ్, ఏ. మహేష్, శ్రవణ్, కే. మహేష్, మల్లయ్య, విజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.












