మహిళా భద్రత, సైబర్ నేరాలపై విద్యార్థినులకు షీ టీం అవగాహన
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల జోన్ పరిధిలోని వేంపల్లి అభ్యాస జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జోన్ షీ టీం ఎస్ఐ ఉషారాణి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు మహిళా భద్రత, సోషల్ మీడియా వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉషారాణి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళల ఆత్మగౌరవం, ఐక్యతను చాటేలా కళాశాలలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో విద్యాసంస్థలు, అధ్యాపకులు, విద్యార్థినుల పాత్ర ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో యువత మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటు పడుతున్నారని, అవసరానికి మించి ఫోన్లు ఉపయోగించడం వల్ల విలువైన సమయం వృథా అవుతుందని తెలిపారు. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలను అపరిచితులతో పంచుకోవద్దని ఆమె సూచించారు.
సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలను పంచుకునే ముందు వాటి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఆలోచించాలని తెలిపారు. కొందరు వ్యక్తిగత ఫొటోలను దుర్వినియోగం చేసి బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకుండా, సమస్యను దాచిపెట్టకుండా ధైర్యంగా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళలు, విద్యార్థినులు సోషల్ మీడియాలో వేధింపులు, బ్లాక్మెయిల్ లేదా ఇతర ఇబ్బందులకు గురైతే షీ టీంను సంప్రదించవచ్చని ఎస్ఐ ఉషారాణి తెలిపారు. బాధితుల వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుతూ, చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు షీ టీం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. విద్యార్థినులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసుల సహాయం పొందాలని ఆమె సూచించారు. మహిళల భద్రత, గౌరవం, రక్షణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు, షీ టీమ్స్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని తెలిపారు.












