మూడవ నెల చెక్కును అందజేసిన ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్
పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు నిరంతరం తోడ్పాటునందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్న సేవా స్ఫూర్తి ఫౌండేషన్ మరోసారి తన సేవా నిబద్ధతను నిరూపించుకుంది. రామగుండం కార్పొరేషన్ 59వ డివిజన్ అశోక్ నగర్‌కు చెందిన అక్కిపెల్లి కీర్తి చరణ్ జేఈఈ మెయిన్స్‌లో 96 ఉత్తమ పర్సంటైల్ సాధించి, నీట్ వరంగల్‌లో కెమిస్ట్రీ విభాగంలో సీటు పొందిన విషయం విదితమే. ఈ విద్యార్థి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆయన నాలుగేళ్ల విద్యాభ్యాసానికి ఆసరాగా నిలిచేందుకు ప్రతి నెలా రూ.2,000 పాకెట్ మనీ ఇస్తామని ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ క్రమం తప్పకుండా చేయూతనందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల సహాయాన్ని అందించగా, సోమవారం రోజున రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మూడవ నెల సహాయక చెక్కును విద్యార్థి తండ్రి అక్కిపెల్లి కీర్తి శ్రీనివాస్‌కు మడిపెల్లి మల్లేష్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తుకు అవరోధం కాకూడదనే లక్ష్యంతోనే మా సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఈ చిన్న సహాయం అందిస్తున్నాం. కీర్తి చరణ్ నీట్లో చక్కగా చదువుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. తమ కుమారుడి చదువుకు ప్రతి నెలా క్రమం తప్పకుండా అండగా నిలుస్తున్న సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్‌కు మరియు ఫౌండేషన్ సభ్యులందరికీ విద్యార్థి తండ్రి శ్రీనివాస్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

