సంస్మరణ సభలో సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
ప్రమాదవశాత్తు మృతి చెందిన సింగరేణి ఉద్యోగి వేముల రాజేందర్ (53) నేత్రదానం ద్వారా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన సంస్మరణ సభ బుధవారం మండలం రొంపికుంటలోని వారి స్వగృహంలో, సదాశయ ఫౌండేషన్, కమాన్‌పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి హాజరయ్యారు.
మొదటగా నేత్రదాత రాజేందర్‌కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం, నేత్ర అవయవ శరీర దానాలపై అవగాహన కల్పించారు. పుట్టెడు దుఃఖంలోనూ ఇద్దరికి చూపును అందించేందుకు కార్నియాలను దానం చేయడానికి ముందుకు వచ్చిన ఆయన తల్లి నర్సమ్మ, భార్య సత్తెమ్మ, కుమార్తె ప్రవలిక, సోదరుడు వేముల కనుకయ్య, వదిన రాజేశ్వరిలకు పాదాభివందనం చేసి, అభినందన జ్ఞాపికను అందజేశారు.
ఇద్దరి జీవితాలలో వెలుగులు నింపిన ఈ కుటుంబాన్ని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి బిస్మచారి, ప్రచార కార్యదర్శి వాసు, గౌరవ అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి, కార్యదర్శి నల్లవెల్లి శంకర్, కోశాధికారి డా. విజయ్ కుమార్, రొంపికుంట సదాశయ బాధ్యులు శ్యామ్ సుందర్, బాణయ్య, కుచన మల్లయ్య తదితరులు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.










