ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచన
హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్లు, శాసనసభ్యుల పిఆర్వోలతో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ నెలికంటి రాము ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రతి గడపకు, ప్రతి కుటుంబానికి చేరేలా సమర్థవంతమైన ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నాయకులకు సూచించారు. ముఖ్యంగా, సోషల్ మీడియాను ప్రజలకు చేరువయ్యే శక్తివంతమైన వేదికగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రజా ప్రభుత్వ పనితీరును ప్రతి ఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త అంకితభావంతో, సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి సలహాదారు శ్రీరామ్ పాల్గొని, పార్టీ ప్రచార వ్యూహాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై పలు సూచనలు చేశారు.












