రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.. 15 రోజుల్లో సమాచారం ఇవ్వాలని ఆదేశం
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగంపై తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆర్టీఐ ఫిర్యాదు అప్పీల్పై సమాచార హక్కు కమిషన్ కార్యాలయంలో జరిగిన విచారణలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ పాల్గొన్నారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ నిర్మాణాలు, అక్రమ నిర్మాణాల సమాచారాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ దాఖలు చేసిన అప్పీల్పై ఈ విచారణ జరిగింది. ఈ విచారణకు మద్దెల దినేష్ హాజరై తన వాదనలు వినిపించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ నిర్మాణాలు, అక్రమ నిర్మాణాల సమాచారాన్ని నిర్ణీత సమయంలో ఇవ్వకుండా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, నిర్లక్ష్య ధోరణితో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, అడిగిన సమాచారాన్ని అందించడంలో ఎందుకు జంకుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని, సమాచారం అందించకపోవడంపై విచారణ సందర్భంగా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మద్దెల దినేష్ తెలిపారు.
సమాచార హక్కు చట్టం కమిషనర్ మాట్లాడుతూ, ఇది ప్రజలకు కల్పించిన హక్కు అని, ప్రజలు కోరిన సమాచారాన్ని చట్టప్రకారం అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు దాచిపెట్టకుండా పారదర్శకంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీఐ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ముందుకు సాగాలని సూచించారు. సమాచారాన్ని కోరితే 30 రోజుల్లోగా ఇవ్వాలని, ఈ విషయం మీకు తెలియదా అని కమిషనర్ అధికారులను ప్రశ్నించారు.
అదేవిధంగా, మొదటి అప్పీల్ దరఖాస్తు పెట్టినప్పటికీ స్పందించలేకపోయారని, దీనిపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, భారీగా ఫైన్లు తప్పవని హెచ్చరించారని తెలిపారు. మరో 15 రోజులు గడువు ఇస్తున్నామని, అయినప్పటికీ సమాచారం ఫిర్యాదుదారుడికి అందించకపోతే కార్పొరేషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని కమిషన్ హెచ్చరించిందని దినేష్ పేర్కొన్నారు.











