ఎలిగేడు (అక్షర జ్యోతి) అక్టోబర్ 05
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.70 కోట్లు ఖర్చు చేశాం: ప్రభుత్వ విప్ విజయరమణ రావు
మండలం రాములపల్లి వద్ద రూ. 200 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను సంబంధిత అధికారులు, స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల, మత బేధాలు లేకుండా అన్ని కులాలు, మతాలకు చెందిన విద్యార్థులు ఒకే వేదికపై పెద్ద ఎత్తున విద్యాభ్యాసం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన రెండున్నర సంవత్సరాలలో పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.70 కోట్లు నిధులు మంజూరు చేసి, పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు నిర్మించామని తెలిపారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లు పరిపాలన చేసిన అప్పటి ఎమ్మెల్యే ప్రభుత్వ స్కూళ్లను ఏ మాత్రం పట్టించుకోకుండా తన ప్రైవేటు పాఠశాలలపైనే దృష్టి పెట్టారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు విమర్శించారు.
ఈ సందర్భంగా మండలంలోని రామునిపల్లెలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలను సోమవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా రామునిపల్లెలో ఇంటర్నేషనల్ స్కూల్‌కు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతుందని, 2560 మంది పిల్లలకు విద్య అందించడంతోపాటు హాస్టల్, ప్లే గ్రౌండ్, డైనింగ్ హాల్ నిర్మిస్తారని తెలిపారు.
ముఖ్యమంత్రి ఆలోచన మేరకు పేద, మధ్యతరగతి పిల్లలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు వీలుగా, టీపీఎఫ్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో దేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి మన రాష్ట్రంలోనే మిడ్ డే మీల్స్‌తో పాటు అల్పాహారాన్ని కూడా గత రెండు నెలల క్రితం ప్రారంభించారని తెలిపారు. టిఫిన్‌తో పాటు మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి జావా కూడా అందిస్తున్నారని తెలిపారు.












