ఎల్ నినో నేపథ్యంలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు.. వారం రోజుల్లో అవగాహన, ఆపై జరిమానాలు
ఇంట్లోని నల్లాకు ఆన్-ఆఫ్ కాక్ లేని కనెక్షన్లను కట్ చేయాలని నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందికి రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశాలు జారీ చేశారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నీటి సరఫరా విభాగం అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావం కారణంగా భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నామని అన్నారు. ఈ కరువును ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఒక్క చుక్క నీరు కూడా వృధా కానివ్వవద్దని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన పైప్‌లైన్ లీకేజీలను అరికట్టడంతో పాటు, వినియోగదారుడి ఇంట్లో కూడా అవసరానికి సరిపడా నీరు పట్టుకున్న తరువాత ఆన్-ఆఫ్ కాక్ ఉపయోగించి నల్లా నీరు వృధా చేయకుండా నిలిపివేయాలని అవగాహన కల్పించాలని అన్నారు. ఈ మేరకు వారం రోజులపాటు నల్లా కనెక్షన్ వినియోగదారులకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఆన్-ఆఫ్ కాక్ ఏర్పాటుకు పెద్దగా ఖర్చు కానందున ప్రతి ఇంట్లో వినియోగదారు స్వయంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారం రోజుల తరువాత జరిగే తనిఖీలలో నల్లా కనెక్షన్‌కు ఆన్-ఆఫ్ కాక్ లేదని గుర్తిస్తే వినియోగదారుడికి వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని, పునరావృతమైతే నల్లా కనెక్షన్‌ను శాశ్వతంగా తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి త్రాగు నీరు కూడా కరువయ్యే పరిస్థితి ఏర్పడబోతున్నందున ఆన్-ఆఫ్ కాక్ ఏర్పాటు చేసుకొని వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. ఆన్-ఆఫ్ కాక్ ఏర్పాటుపై అవగాహన కల్పించడంలో విఫలమైన నగర పాలక సంస్థ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజు విడిచి రోజు నిర్ణీత సమయానికి కనీసం ఒక గంట పాటు నీరు వదలాలని, అలాగే వినియోగదారులతో సిబ్బంది మర్యాదగా స్నేహపూర్వకంగా మెలగడంతో పాటు వారి ఫోన్ కాల్స్‌కు వెంటనే స్పందించాలని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎ.ఇ మనోజ్, సూపర్ వైజర్ శశి తదితరులు పాల్గొన్నారు.












