రూ. 7.5 కోట్ల ప్యాకేజీలో భాగంగా రూ. 15 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను మేయర్ ప్రారంభించారు
చిన్న వీధులలో కూడా అత్యవసర పరిస్థితుల్లో కనీసం అంబులెన్స్ వెళ్ళేలా రహదారుల నిర్మాణం చేపడుతున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. డి.ఎం.ఎఫ్.టి నిధులు రూ. 7.5 కోట్ల ప్యాకేజీ పనుల్లో భాగంగా రూ. 15.00 లక్షల అంచనా వ్యయంతో 53వ డివిజన్ ఎల్ ని నగర్లోని ఒక వీధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ గట్ల రమేష్తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వెడల్పైన రహదారుల నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలోని ప్రతి వీధిలోని చివరి ఇంటివరకు రోడ్డు, యూజీడీ, మంచి నీటి సరఫరా, వీధి లైట్లు తదితర అన్ని మౌలిక వసతులు కల్పించాలనే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ లక్ష్యం మేరకు అన్ని డివిజన్లలోనూ పనులు జరుగుతున్నాయని అన్నారు. నాణ్యతతో పనులు పూర్తయ్యేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తాఫా, అడ్డాల గట్టయ్య, డేవిడ్ రాజు, నాయకులు రాజేందర్, మారెల్లి రాజిరెడ్డి, ధరణి జలపతి, నగర పాలక సంస్థ ఏఈ తేజస్విని తదితరులు పాల్గొన్నారు.


