పెద్దపల్లి, 5 October
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిపడిన రూ.59 వేల కోట్లు వెంటనే చెల్లించాలని కార్మిక సంఘం డిమాండ్
ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు గడిచినా సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు లాభాలను ప్రకటించకపోవడం, కార్మికులకు రావలసిన లాభాల వాటాను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్జీవన్ జీడికే 11 ఇంక్లైన్ గనిలో ఏఐటీయూసీ ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో గని మేనేజర్‌కు మెమోరాండం అందజేశారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటించాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిపడిన సుమారు 59 వేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దసరా పండుగ లోపు కార్మికులకు లాభాలు చెల్లించాలని యాజమాన్యాన్ని కోరారు.
అలాగే, రక్షణ పరికరాలు, పనిముట్లు కార్మికులకు వెంటనే అందజేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ గొడిశల నరేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, గడ్డం బాలు, పొన్నం రంజిత్, బిట్టు తిరుపతి, దుర్గం శంకర్, నూతి మహేష్, కిరణ్, రామారావు, అడవి మల్లయ్య, శ్రీకాంత్, లక్ష్మణ్ లతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.












