జేఎన్టీయూ, మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాలల్లో భద్రతా ఏర్పాట్ల సమీక్ష
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టీజీపీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లను అడిషనల్ డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లిలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, పోలీస్ బందోబస్తు, పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.


